Tuesday, March 24, 2020

భక్తి మరియు జ్ఞానము

భక్తి  మరియు జ్ఞానము

భక్తుడు : యోగులు అవలంబించే యోగ మార్గానికి మరియు ప్రపత్తి మార్గానికి భేదము కలదా ?

మహర్షి :  జ్ఞాన మార్గము మరియు భక్తి మార్గము (అనగా ప్రపత్తి ) ఒక్కటే.  ఆ రెంటికీ భేదము లేదు.  ఆత్మ విచారణ మార్గము  వలన కలిగే మోక్షము ఆత్మకు శరణాగతి చెందుట వలన కూడా కలుగును.  పరిపూర్ణ శరణాగతి చెందిన వానికి 'నేను' అనే  అహంకారపుటా లోచన తలెత్తదు.  సంపూర్ణ శరణాగతి చెందిన స్థితిలో సమస్త వాసనలు నశించి , నీవు ముక్తుడవు అవుతావు. ఈ రెంటిలో ఏ మార్గాన్ని అనుసరించినా , నీకు ప్రత్యేక సత్వము వుండరాదు. 

భక్తుడు : మంచి కర్మలు ఆచరించుటవలన మనము స్వర్గానికి వెళ్ళెదమా ? 

మహర్షి  :   మన ప్రస్తుత ఉనికి ఎంత నిజమో స్వర్గము కూడా అంతే నిజం.  కానీ ఆత్మ విచారణ చేపట్టి మన స్వ స్వరూపాన్ని తెలుసుకొనిన యెడల , స్వర్గము గురించి కానీ ఇతర విషయాల గురించి కానీ ఆలోచించుట ఎందులకు ?

 భక్తుడు : పునర్జన్మ నుండి విముక్తి కోసం నేను ప్రయత్నించవలయునా ?

మహర్షి : అవును.  పుట్టినది ఎవరు ? ప్రస్తుతం  ఈ ఉనికి తాలూకు ఇబ్బంది ఎవరికి ?  అని ప్రశ్నించు.  గాఢనిద్రలో పునర్జన్మల గురించి గానీ ,  ప్రస్తుత ఉనికిని గురించి గానీ , ఆలోచించెదవా ? కాబట్టి ఈ ప్రస్తుత సమస్య ఎచ్చట నుంచి పుట్టుచున్నదో కనుక్కో.  అది పుట్టు స్థానము యందే పరిష్కారము కూడా కలదు ! పునర్జన్మ కానీ దానికి సంబంధించిన ఇబ్బందులు మరియు  విచారము లేవని గ్రహించెదవు.  ఉన్నదంతా అదే.  అదియే ఆనందమయ స్థితి.  వాస్తవానికి  మనకు పునర్జన్మ లేదు.  కనుక పునర్జన్మ యొక్క విచారమేల ?

Labels:

0 Comments:

Post a Comment

<< Home