Wednesday, March 25, 2020

శ్రీ రమణమహర్షి జీవితచరిత్ర లో కొన్ని ముఖ్యఘట్టాలు -7.

శ్రీ రమణమహర్షి జీవితచరిత్ర లో కొన్ని ముఖ్యఘట్టాలు -7.

ఓం నమో భగవతే శ్రీరమణాయ !
( రమణుల జీవన విధానమే, మనకు కరదీపిక. కాబట్టి, వారి జీవితం తీసుకున్న అనేక మలుపులను, వారి జీవన విధానాన్ని, మనం కొన్నిరోజులపాటు, భక్తి పూర్వకంగా పరిశీలిద్దాం.  ఆకళింపు చేసుకుందా౦.  ఆచరణకు ప్రయత్నిద్దాం. )

అరుణాచలేశునిచే అక్కున చేర్చుకోబడిన వేంకటరామన్,  తరువాత ' అపీతకుచాంబ ' ఆలయాన్ని దర్శించుకున్నాడు.  ' అయ్యంగుల ' కోనేటి వద్దకు వెళ్ళాడు.  దగ్గరవున్న భక్ష్యపొట్లాలు కోనేటిలోనికి విసిరివేసాడు.  తన వెనుకటి జీవితస్మృతులు గుర్తుకు
వచ్చేవన్నీ దూరంచేసుకునే కార్యక్రమంలో,  తన ఒత్తైన పొడవాటి జుట్టు కూడా అనవసరం అనుకున్నాడు.  అలా అనుకుంటూ వుండగానే, ఒక అపరిచితుడు ఆతనిని ఒకమంగలి యింటివద్దకు చేర్చి, అద్రుశ్యుడయ్యాడు.  ఏమి ఈశ్వరలీలా పరంపర !
అడుగడుగునా వేంకటరామన్ ని చెయ్యిపట్టుకుని నడిపించిన తండ్రి,  శిరోముండనం అనుకున్నంతలో తనప్రమేయం లేకుండానే వేంకటరామన్, ముగించుకునేటట్లు చేసాడు.

ఇక కౌపీన వస్త్రధారణ.  ఇది బ్రహ్మచర్య వ్రతధారణకు గుర్తు.  తనుకట్టుకున్న వస్త్రాన్నే చింపి, ఒక పేలికను కౌపీనంగా కట్టుకున్నాడు, వేంకటరామన్. మంగలికి ఇవ్వగా మిగిలిన ద్రవ్యాన్ని కూడా అక్కడే పారవైచాడు. మళ్ళీ జీవితంలో ద్రవ్యాన్ని చేతులతో తాకలేదు. ఇక మిగిలింది బ్రాహ్మణ సంకేతమైన యజ్ఞోపవీతం.  తన పూర్వ జీవితములో తండ్రిగారు ఉపనయనం లో వేసినది.  ' జగానికే తండ్రి అయిన అరుణాచలేశ్వరుని పుత్రుడను కనుక, నేను కులాలకు అతీతుడను '  అనుకుని వెంటనే జంధ్యాన్ని కూడా తీసి పారవేశాడు.

ఇక మిగిలింది స్నానం.  అదికూడా అనవసరమని వేంకటరామన్ వూరుకున్నాడు. అయితే తండ్రి నియమలోపం జరుగనివ్వలేదు.  బ్రహ్మాండమైన వర్షం కురిపించాడు. నీటిధారల మధ్య, సన్యాస వ్రతధారణ నిరాటంకంగా పరిసమాప్తమైనది. ఆశ్చర్యం ! అప్పటిదాకా గ్రామంలో వర్షాలు లేక ప్రజలు ఇబ్బందిపడ్డారు.  చాలారోజుల తరువాత వెంకటరామన్ వచ్చి అక్కడ వర్షం కురిపించాడు,  తన సన్యాసధారణ కోసం.

ఆరాత్రి అంతా వేంకటరామన్, ఆలయంలోని వేగాళ్ళమండపం లో చలికి గజగజ వణికిపోతూ, కాళ్ళు దగ్గరగా ముడుచుకుని మౌనంగా ధ్యాననిష్టలో కూర్చున్నాడు,  కటిక ఉపవాసంతో.   మరునాడు ఉదయం ప్రక్కనేవున్న శ్రీగోపుర సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో వుంటున్న మౌనస్వామి శిష్యునితో ఆ మండపం వద్దకు వచ్చాడు.  అక్కడే పచార్లు చేస్తున్న వేంకటరామన్ ని పరీక్షగాచూసి, '  ఈ కుర్రవానికి ఆహారం తీసుకుని రా ! '  అని  శిష్యునికి చెప్పాడు.  వారు తెచ్చుకున్న భిక్షాన్నం లోని కొంతభాగాన్ని ఉప్పుడు బియ్యపు అన్నం పెద్ద పెద్దమెతుకులతో,  పైన ఉప్పు,  అడుగున పుల్లనీళ్ళు, నంచుకునేందుకు ఊరగాయబద్దతో తీసుకువచ్చాడు.  ' అదే ఈశ్వరుడు మనకు పెట్టిన మొదటి భిక్ష.  ఆ అన్నం వారే నోట్లో పెడితే తిని ఆ నీళ్ళు తాగాను.  '  అని తరువాత రోజుల్లో భక్తులతో ఆ సంఘటన తరచూ చెప్పేవారు, రమణులు.

ఆ తరువాత 3 యేండ్లదాకా వేంకటరామన్ దేవాలయ గర్భగుడికి వెళ్ళలేదు. హృదయ గర్భంలో తండ్రి పదిలంగా వున్నాడు కదా ! అక్కడి సాంప్రదాయం ప్రకారం, విరాగులు అయిన వారిని ' పరదేశులు ' అంటారు.  మన వేంకటరామన్ కూడా ఆ విధంగా బ్రాహ్మణ పరదేశి అయినాడు.  వేంకటరామన్ జీవితంలో పూర్తిగా మార్పు వచ్చింది.

మొదటిరోజుల్లో వేగాళ్ళ మండపం మధ్యలో వున్న, అరుగుమీద, మౌనంగా ధ్యానంలో వుండేవాడు, మన బ్రాహ్మణ పరదేశి.  అప్పుడప్పుడు లేచి పచార్లు చేసినా మాట్లాడేవాడు కాదు.  ఆహారం గురించి యెవరినీ అడిగే ప్రసక్తేలేదు.  తమకు తాముగా యెవరైనా యేదైనా యిస్తే, సమాధిస్థితిలో లేకపొతే తీసుకునేవాడు. అదే కదా అయాచితం అంటే ! కొత్తప్రదేశం.  ఆదరించేవారు లేరు.  ఏ విధమైన రక్షణలేదు.  అసలు సిసలైన సన్యాస జీవితం.

కొంటెపిల్లలు కొందరు, రాళ్ళు, చిల్లపెంకులు వేసి పరదేశి ధ్యానానికి అంతరాయం కలిగించేవారు.  వారి బారినుండి తప్పించుకొనడానికి పరదేశి,  అక్కడున్న పాతాళలింగ గుహను ప్రవేశించాడు.  అందులోకి వెళ్ళడానికి పిల్లలు భయపడేవారు.  లోపల అంతా చీకటి.   అందులోనికి వెళ్లి పరదేశి ధ్యాననిష్టలో వుండేవాడు. అక్కడా కీటకాల బాధ, పిల్లలబాధ మొదలైంది.  పరదేశి ధ్యాననిష్టను చూసి, కంచినుండి వచ్చిన శేషాద్రి స్వామి,  ఆయనను గుహ వెలుపల నుండి జాగ్రత్తగా చూసుకునేవాడు.

శేషాద్రిస్వామినీ లెక్కచెయ్యక కొంతమంది తురకబాలురు,  గుహలోనికి రాళ్ళు వేస్తుండగా,   ప్రక్కనుంచి వెళుతున్న వేంకటాచలమొదలియారు వారిని తరిమివేసి,  గుహలోనికి వెళ్లి,  కటికచీకటిలో శివలింగం వెనుక ధ్యానమగ్నుడైన చిన్నస్వామి ( పరదేశి ) ని చూశాడు. అక్కడే దగ్గరలో వేగాళ్ళమండపానికి పశ్చిమంగా వున్న తోటలో పళనిస్వామి అనే ఆయన తనశిష్యులతో వుండేవాడు.  వారిని సహాయం పిలిచి అక్కడినుంచి పరదేశిని బైటకు తీసుకువద్దామని ప్రయత్నించినా,  దేహస్మృతి కలగలేదు చిన్నస్వామికి.

వారు యేమీచెయ్యలేక ధ్యానభంగం చెయ్యడం యిష్టంలేక, ఆయనకు మ్రొక్కి వెళ్లిపోయారు.  చిన్నస్వామిని అప్పటి నుంచి ' బ్రాహ్మణస్వామి ' అని పిలవడం మొదలుపెట్టారు.  అలా 'పరదేశి' పేరు నుండి ' స్వామి' అయ్యాడు మన వేంకటరామన్.

శ్రీ రమణమహర్షి జీవితచరిత్ర లో కొన్ని ముఖ్యఘట్టాలు -8.
ఓం నమో భగవతే శ్రీరమణాయ !

మన వేంకటరామన్ పరదేశి అనే పేరు నుండి బ్రాహ్మణస్వామి గా రూపాంతరం చెందాడని చెప్పుకున్నాం కదా !

బ్రాహ్మణస్వామి మరికొన్ని రోజులకు  పాతాళలింగ గుహవదలి,  తనకు మొదట భిక్షపెట్టిన గోపుర సుబ్రహ్మణ్యస్వామి గుడిలో మౌనస్వామి సంరక్షణలో,  సుమారు రెండునెలలు వున్నారు.  అప్పుడే రామచంద్రయ్యర్ అనే ఆయనకు స్వామిరాను అని ,  చెబుతున్నా,  బలవంతంగా యింటికి తీసుకువెళ్లి, అరిటాకులో సుష్టుగా భోజనం పెట్టే భాగ్యం కలిగింది.

అరుణాచలం వచ్చిన తరువాత నాలుగునెలల వరకు స్వామి స్నానం చెయ్యలేదు. ఒకరోజు పొన్నుస్వామి అనే భక్తుడి భార్య మీనాక్షమ్మ వచ్చి,  స్వామిని బలవంతంగా లాగి కూర్చోబెట్టి,  సీకాయతో తలంతా రుద్ది, స్నానం చేయించింది.  తరువాత మళ్ళీ సంవత్సరం దాకా స్వామికి స్నానమేలేదు.

అదే విధంగా, నీలకంఠ౦ అనేభక్తుడు స్వామికి క్షురకర్మ చేయించాలని ప్రయత్నించగా అక్కడినుండి దూరంగా స్వామి వెళ్ళిపోయారు.  స్వామికి యిష్టంలేదని గ్రహించి అతను ఆప్రయత్నం విరమించుకున్నాడు.  అంతే. మళ్ళీ ఒకటిన్నర సంవత్సరందాకా స్వామికి క్షౌరమేలేదు.

కౌపీనం చిరిగి పోయినా 1898 చివరివరకు అదే చిరిగిన కౌపీనంతో తిరిగారు కానీ, మార్చుకోలేదు.  కౌపీనం ధరించిన వాడితో ఆయనకు  బంధం వుంటేగదా ! వచ్చే భక్తులకు చూడయిబ్బందిగా వుంటే, స్వామి వాహనమండపం దగ్గరా, వాహనాల గోడవెనుక కొంతకాలం ధ్యానంలో  గడిపారు.  తనువు తనదికాని తపోజీవితం.

మరికొన్నాళ్ళకు స్వామి, శివగంగ తీర్ధం దగ్గర మారేడుచెట్టు క్రింద, ఇప్పచెట్టు దగ్గర, ఇంకొన్నాళ్ళు మంగై పిళ్ళయారు గుడిలోను కాలం గడిపారు.  అప్పుడే రత్తమ్మ అనే దేవదాసికి, విపరీతమైన భక్తితో స్వామి భోజనం యేర్పాట్లు దగ్గరుండి చూసుకునే భాగ్యం కలిగింది.  తిరుమణి గ్రామంలో వుండే ఉద్దండి నాయనారు అనే శైవభక్తుడు ఎన్నో గ్రంధాలు, వేదాలు చదివినా ఆధ్యాత్మిక శాంతి పొందలేక పోయాడు. అయితే, ఇప్పచెట్టు క్రింద తదేకనిష్ఠతో వున్న స్వామిని చూడగానే,  నాయనారు మనసు ఝల్లుమంది. ఆయనే తన గురువని విశ్వాసం కుదిరింది.  ఎముకలు కోరికే శీతాకాలంలో కూడా స్వామి సమీపంలో వుండి, నాయనారు సేవించసాగాడు.

పిల్లల ఆగడాలు తగ్గినాయి.  అయినా ఒకరోజు నాయనారు లేని సమయంలో ఒకపోకిరి పిల్లవాడు,  స్వామి ధ్యానంలో వుండగా, వెనుక మూత్రవిసర్జన చేసి పారిపోయాడు. బాహ్యస్మృతి వచ్చిన తరువాత విషయం తెలిసినా స్వామి యేమాత్రం బాధపడలేదు. ఆ శరీరంతో ఆయన సంబంధం తొలగిపోతున్నదన్నందుకు యివన్నీ నిదర్శనాలే కదా ! స్వామి తదేకనిష్ఠతో వుండి కండ్లు తెరచేవారు కాదు.  నాయనారు మాత్రం జ్ఞానవాశిష్టం, కైవల్య నవనీతాలు పఠిస్తో యెదురుగుండా కూర్చునేవారు.  లౌకికులకు అర్ధంగాని గురుశిష్య సంబంధము.

అలా అయిదారునెలలు గడిచాక, స్వామి గురుమూర్తమునకు మకాము మార్చారు. గురుమూర్తంలో సమాధి పూజలను అన్నామలై తంబిరాను యెంతో నిష్టతో చేస్తూ వుండేవాడు.  ఒకనాడు స్వామిని ఇప్పచెట్టు క్రింద చూసి, ఆకర్షితుడై నాయనారు సలహాపై, స్వయంగా స్వామినే అడిగాడు తంబిరాను, గురుమూర్తమునకు రమ్మనమని. అక్కడ స్వామి ధ్యానానికి అంతరాయం వుండదు, అరుణాచలం కి కూడా దగ్గరే ఉంటుందని నచ్చజెప్పి, స్వామిని గురుమూర్తం రావడానికి అంగీకరింపజేశాడు. 1897 ఫిబ్రవరిలో స్వామి గురుమూర్తమునకు వచ్చారు. ఆనాటి నుండి ' బ్రాహ్మణస్వామి '  ' గురుమూర్తం స్వామి ' అయినారు.

స్వామి ధ్యానము యెట్టి విఘ్నాలులేకుండా సాగిపోతుండేది.   అయితే, శరీరానికి చెయ్యవలసిన వుపచారాలు లోపించడంవలన, శరీరం అంతా దుమ్ముకొట్టుకు పోయింది. వెంట్రుకలు జడలు కట్టాయి.  గోళ్ళు వంకరలుగా పెరిగి చేతులను కూడా నిరుపయోగం చేశాయి.  చీమలు విపరీతంగా బాధ పెట్టేవి.  స్వామి శరీరపోషణ లేకపోవడం వలన చూడడానికి భీభత్సంగా కనుపించేవారు.  ఒకనాడు మీనాక్షి అనే భక్తురాలు బలవంతాన స్వామికి నూనెరాసి తలంటింది. ఆ విధంగా స్వామి రెండోసారి స్నానంచేశారు.

కాలం గడుస్తున్న కొద్దీ జనులకి స్వామిపట్ల గౌరవం పెరిగింది. స్వామికి భిక్షపెట్టే భాగ్యం తమకు కావాలంటే తమకని తగవులాడుకోవడం ప్రారంభించారు.  పూర్వం భిక్ష దొరకడం కష్టమైతే,  యిప్పుడు భిక్షపెట్టేవాళ్ళు ఎక్కువై, ఇబ్బంది కలుగసాగింది . తంబిరానుకు కూడా స్వామి పట్ల భక్తివిశ్వాసాలు బాగా కుదిరాయి.  ధూప దీప నైవేద్యాలతో స్వామిని ఆరాధించాలని ఒకనాడు ప్రయత్నంచేశాడు.

స్వస్తి.
శ్రీ రమణుల ఆశీస్సులతో మరి కొన్ని విషయాలు రేపు....
ప్రేమతో,
ప్రభాకర్.

Labels:

0 Comments:

Post a Comment

<< Home